Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Dhanush Political Entry: విజయ్ బాటలో ధనుష్ ? తమిళ రాజకీయాల్లోకి మరో హీరో.. 2031 లక్ష్యంగా కామ్‌గా స్క్రిప్ట్!

    1 hour ago

    Dhanush Tamil Politics 2031: తమిళ సినీ హీరో ధనుష్ రాజకీయ రంగప్రవేశంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. అభిమానుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ దిశగానే ఉన్నాయి.

    Kollywood Actors In Politics: తమిళనాడు రాజకీయాలకు, వెండితెరకు మధ్య విడదీయరాని బంధం దశాబ్దాలుగా ఉందనేది చారిత్రక సత్యం. ఎంజీఆర్, కరుణానిధిల నుంచి జయలలిత, విజయకాంత్, కమల్ హాసన్, ఇటీవలే రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజగం  స్థాపించిన దళపతి విజయ్ వరకు కోలీవుడ్ గ్లామర్ స్థానిక రాజకీయాలను నిరంతరం ప్రభావితం చేస్తూనే ఉంది. తాజాగా ఈ జాబితాలో వర్సటైల్ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ పేరు కూడా చేరడం కోలీవుడ్ వర్గాల్లోనే కాకుండా తమిళ రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమైంది. తక్షణమే ఎలాంటి పార్టీ ప్రకటన లేకపోయినప్పటికీ, 2031 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ధనుష్ ఇప్పటినుంచే సమాజంలో తన పునాదిని బలోపేతం చేసుకునే పనిలో పడ్డారని  చెబుతున్నారు 
     
     అభిమానుల సమావేశంలో వ్యాఖ్యలు.. రాజకీయ ఆసక్తికి సంకేతం 

    ఇటీవల తన అభిమానుల సంఘం నర్పణి మండ్రం ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ధనుష్ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు ప్రధాన కారణమయ్యాయి. తన అభిమానులు కేవలం సినిమాలు, ఆడియో లాంచ్‌లు, కటౌట్లకు పాలాభిషేకాలు చేసేందుకే పరిమితం కాకూడదని ఆయన పిలుపునిచ్చారు.  మనం ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి.. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని మన ఐక్యతను సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలి అని ధనుష్ కోరడం వెనుక స్పష్టమైన సామాజిక-రాజకీయ ఆలోచన ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. విజయ్ కూడా తన టీవీకే పార్టీని అధికారికంగా ప్రకటించడానికి కొన్నేళ్ల ముందే అభిమాన సంఘాల ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విస్తరించారు. 

    ధనుష్  ఇమేజ్  ప్లస్ పాయింట్ అవుతుందా? 

    తమిళనాడు సమాజంలో ధనుష్ ఇమేజ్ చాలా విభిన్నమైనది. ఆయన కేవలం ఒక కమర్షియల్ మాస్ హీరో మాత్రమే కాదు.   ఆడుకాలమ్ ,  అసురన్  లాంటి చిత్రాలతో సామాజిక అసమానతలు, అణచివేతకు గురైన వర్గాల ఆవేదనను ప్రతిబింబించే పాత్రలతో సామాన్యుడికి  బాగా దగ్గరయ్యారు. హాలీవుడ్, బాలీవుడ్ స్థాయికి ఎదిగినప్పటికీ స్వయంకృషితో ఎదిగిన నటుడిగా  ఇమేజ్ ఆయన సొంతం. ఈ రకమైన కంటెంట్ ఉన్న పాత్రలు ,  ఆయన వ్యక్తిగత ఇమేజ్ భవిష్యత్తులో రాజకీయాల్లో ప్రజలతో మమేకం కావడానికి ఒక బలమైన పునాదిగా ఉపయోగపడే అవకాశం ఉంది.

     విజయ్  తో సరితూగుతాడా? 

    దళపతి విజయ్‌తో పోలిస్తే ధనుష్ మాస్ ఫాలోయింగ్ ,  బాక్సాఫీస్ స్టామినా భిన్నమైనవి. విజయ్ దశాబ్దాలుగా పక్కా ప్లానింగ్‌తో మాస్ ఇమేజ్‌ను నిర్మించుకుని, తమిళనాడు వ్యాప్తంగా పటిష్టమైన ఫ్యాన్ బేస్ అడ్వాంటేజ్‌తో నేరుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 
    మరోవైపు ధనుష్ స్టైల్ పూర్తిగా వేరు. విజయ్ 2026 ఎన్నికలను టార్గెట్ చేస్తే, ధనుష్ ఏకంగా 2031 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని సుదీర్ఘమైన  వెయిట్ అండ్ వాచ్  విధానాన్ని ఎంచుకుంటున్నట్లు సంకేతాలు ఉన్నాయి.  తమిళనాడులో కేవలం నటుడైనంత మాత్రాన రాజకీయ విజయం సాధించడం సులభం కాదని చరిత్ర చెబుతోంది. విజయకాంత్ డీఎండీకే ద్వారా తొలి నాళ్లలో కొంత ప్రభావం చూపినప్పటికీ ఆ తర్వాత నిలదొక్కుకోలేకపోయారు. రజనీకాంత్ చివరి నిమిషంలో రాజకీయాలకు దూరంగా జరిగితే, కమల్ హాసన్  మక్కల్ నీది మయ్యమ్ సొంతంగా గెలవలేక చివరకు డీఎంకే కూటమితో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది.  

    ప్రస్తుతానికి ధనుష్ వైపు నుంచి రాజకీయ పార్టీపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా, ఆయన ఆంతరంగిక వర్గాలు మాత్రం సేవా కార్యక్రమాల విస్తరణను వేగవంతం చేస్తున్నాయి. సినిమా కెరీర్‌లో దర్శకుడిగా, నటుడిగా పీక్‌లో ఉన్న ధనుష్, రాజకీయాల్లోకి రావాలనుకోవడం ఒక విప్లవాత్మకమైన అడుగే. 2026 తమిళనాడు ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత విజయ్ పార్టీ పనితీరును బట్టి 2031 నాటికి ధనుష్ తన పొలిటికల్ ఎంట్రీపై పూర్తి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.  

    Click here to Read More
    Previous Article
    PCOS vs Iron Deficiency : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
    Next Article
    Chandrababu 4.0 PR Strategy: చంద్రబాబు 4.0'లో మారిన పీఆర్ మార్క్ - మోదీ వ్యూహంతో రీ-పొజిషనింగ్ - అంతా వైరల్ కంటెంటే!

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment