Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    రాజమహేంద్రవరం కల్తీ పాల మరణాలు.. సమస్య ఉంటే ఈ నెంబర్‌కు ఫోన్ చేయండి

    3 weeks ago

    రాజమహేంద్రవరంలోని లాలాచెరువు చౌడేశ్వరినగర్ ప్రాంతంలో పాలు తాగిన అనంతరం కిడ్నీలు ఫెయిలై చనిపోతున్న ఘటనలో అధికారులు హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు.

    రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో వెలుగుచూసిన ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ (Acute Renal Failure) ఘటనలపై జిల్లా అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో కోరుకొండ మండలం నరసాపురంలో ఆరోగ్య శాఖ కమిషనర్ జి. వీర పాండ్యన్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, డీఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ సోమవారం క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈ బృందం గ్రామంలోని పరిస్థితులను పరిశీలించడమే కాకుండా, ఈ అనారోగ్య సమస్యలకు గల కారణాలను అన్వేషించేందుకు చేపట్టిన 'ఫ్యాక్ట్ ఫైండింగ్' ప్రక్రియను క్షుణ్ణంగా సమీక్షించింది.

    ప్రస్తుతం ఈ ఘటనకు గల మూలాలను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామంలోని తాగునీరు, పాలు, ఇతర ఆహార పదార్థాల నమూనాలను సేకరించి, సమగ్ర పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీలకు పంపినట్లు అధికారులు వెల్లడించారు. ఆరోగ్య శాఖ బృందాలు ఇప్పటికే గ్రామంలో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నాయి. ఎవరిలోనైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

    హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
    ప్రజలు ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని తూర్పు గోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. బాధితులకు లేదా ప్రజలకు అత్యవసర సహాయం కావాలన్నా, లేక ఏవైనా ఫిర్యాదులు చేయాలన్నా వెంటనే సంప్రదించడానికి 9494060060 అనే ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రజలు అనవసరపు అపోహలను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

    రాజమహేంద్రవరంలోని లాలాచెరువు చౌడేశ్వరినగర్ ప్రాంతంలో పాలు తాగిన అనంతరం కిడ్నీలు ఫెయిలై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ ఘటనలో ఐదుగురు వృద్ధులు మృతి చెందారు. సోమవారం రాధాకృష్ణమూర్తి (74), ఎన్. శేషగిరిరావు (72), తాడి రమణి చనిపోయారని అధికారులు తెలిపారు. అంతకుముందు భాగిశెట్టి కనకరత్నం, తాడి కృష్ణవేణి అనే ఇద్దరు వృద్ధులు కూడా ఇదే తరహాలో మరణించారు. ఈ నెల 15వ తేదీ నుండి బాధితులు ఒక్కొక్కరుగా అస్వస్థతకు లోనయ్యారు. ప్రస్తుతం సుమారు 12 మంది వాంతులు, పొట్ట ఉబ్బడం మరియు మూత్రవిసర్జన కాకపోవడం వంటి తీవ్రమైన లక్షణాలతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో 60 ఏళ్లు పైబడిన వారితో పాటు ఐదు నెలల చిన్నారి, మూడేళ్ల బాలుడు కూడా ఉండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. 

     

    పాలు అమ్మిన వ్యక్తిని విచారిస్తున్న పోలీసులు

    ప్రాథమిక విచారణలో బాధితులందరికీ కోరుకొండ మండలానికి చెందిన గణేష్ అనే వ్యక్తి పాలు సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. శివరాత్రి రోజున పాలు, పెరుగు చేదుగా ఉన్నాయని, అవి తాగిన తర్వాతే కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడు గణేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితుల నుండి సేకరించిన రక్త, మూత్ర నమూనాలను ఇప్పటికే టాక్సికాలజీ పరీక్షల నిమిత్తం పంపించారు. ఈ నివేదికలు వచ్చిన తర్వాతే ఈ మరణాలకు కల్తీ పాలు కారణమా లేదా మరేదైనా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనేది స్పష్టమవుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం జిల్లా అధికారులు, ఆరోగ్య శాఖ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.

    Click here to Read More
    Previous Article
    Manipur President Rule: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత! MHA నోటిఫికేషన్ జారీ!
    Next Article
    Ratnachal Superfast Express: నేటి నుండి రత్నాచల్ ఎక్స్ ప్రెస్ లో ఈ మార్పు గమనించండి

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment