Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Hyderabad Metro:ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ?

    2 weeks ago

    Hyderabad Metro:హైదరాబాద్‌ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ప్రభుత్వపరమైంది. ఎల్‌ అండ్‌ టీ నుంచి వంద శాతం షేర్లను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసింది. 

    Hyderabad Metro:హైదరాబాద్‌ మహానగర ముఖ చిత్రాన్ని మార్చేసిన లక్షలాది మందికి చేరువైన హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టులో ఒక కీలక అధ్యాయం ముగిసింది. ఇన్నాళ్లూ ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం కింద లార్సన్ అండ్ టూబ్రో(ఎల్‌ అండ్ టీ) నిర్వహణలో ఉన్న మెట్రో మొదటి దశ, ఇప్పుడు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ వశమైంది. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఎల్‌ అండ్ టీ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోగా మెట్రో పగ్గాలను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. 

    ఒప్పందం ఎలా జరిగింది?

     

    హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశను హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్‌ ద్వారా స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కార్యరూపం దాల్చింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో కీలక ఒప్పందం జరిగింది. ఎల్‌ అండ్ టీ మెట్రో రైలు లిమిటెడ్‌లో ఉన్న మొత్తం వంద శాతం ఈక్విటీని 1, 461.47 కోట్లకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. 
    ఈ ఒప్పంద పత్రాలపై హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్‌ అండ్‌ టీ ప్రతినిధి డీకే సేన్, ఎల్‌ అండ్ టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణరావు, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మెట్రో మాజీ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సాక్షులుగా ఉన్నారు అంతకు ముందు ఎల్ అండ్‌ టీ ఛైర్మన్ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ ప్రక్రియపై చర్చించారు. 

    అప్పుల సర్దుబాటు 

     

    మెట్రోను స్వాధీనం చేసుకోవడంలో కేవలం వాటాలను కొనుగోలు మాత్రమే కాకుండా భారీ ఆర్థిక బాధ్యతలను కూడా ప్రభుత్వం స్వీకరించింది. ఏప్రిల్ 30, 2026 నాటికి ఎల్ అండ్ టీ మెట్రోపై ఉన్న 13, 538.53 కోట్ల అప్పును ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం హామీతో రీఫైనాన్స్‌ చేయనున్నారు. ఈ లావాదేవీ పూర్తి అయిన తర్వాత ఎల్‌ అండ్‌టీ ఈ మెట్రో ప్రాజెక్టుతో ఎటువంటి అనుబంధం ఉండదు. ఈ ప్రక్రియ జూన్ 30 నాటికి పూర్తి కావచ్చని అంచనా. ఈ భారీ లావాదేవీకి ఐడీబీఐ క్యాపిటల్ టాన్సాక్షన్ అడ్వైజర్‌గా, సరఫ్ అండ్ పార్టనర్స్‌ లీగల్ అడ్వైజరీగా వ్యవహరించాయి. 

    హైదరాబాద్ మెట్రో ప్రస్థానం

    హైదరాబాద్ మెట్రో ప్రయాణం 2010లో ప్రారంభమైంది. మొదట మేటాస్ కన్సార్షియం ఈ టెండర్‌ పొందినా, సత్యం కుంభకోణం తర్వాత అది రద్దు అయ్యింది. 2010లో జరిగిన రెండో టెండర్లలో ఎల్‌ అండ్ టీ అత్యంత తక్కువు కోట్ చేసి  ప్రాజెక్టును దక్కించుకుంది. అప్పట్లో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. 71 కిలోమీటర్ల మేర ప్రాజెక్టు అంచనా వ్యయం మొదట 12, 132 కోట్లు కాగా, పూర్తి అయ్యే సరికి ఇది పెరిగింది. బ్యాంకుల నుంచి 11, 478 కోట్ల రుణం, ఎల్ అండ్ టీ వాటా 3,440 కోట్లుగా ఉంది. 

    మొదటి దశ 2017నవంబర్ 29న ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 69.2 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లలో సేవలు అందుతున్నాయి. 

    ప్రభుత్వ స్వాధీన నిర్ణయానికి కారణాలు ఇవే

    ఎల్ అండ్ టీ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగడానికి, ప్రభుత్వం దీనిని స్వీకరించడానికి బలమైన కారణాలు ఉన్నాయి. కోవిడ్ సమయంలో ఆరు నెలలపాటు మెట్రో నిలిచిపోవడంతో ప్రాజెక్టు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. ప్రభుత్వం అప్పట్లో 900 కోట్ల వడ్డీ లేని రుణాన్ని కూడా ఇచ్చింది. మొదట 35 ఏళ్ల ఒప్పందం ఉండగా, దానిని 2072 వరకు అంటే మరో పాతికేళ్లు పొడిగించారు. అయితే ఆర్థిక ఒత్తిడి కారణంగా ఎల్ అండ్ టీ తప్పుకోవాలని భావించింది. మొదటి దశ ప్రైవేటు వద్ద, రెండో దశ ప్రభుత్వం వద్ద ఉంటే నిర్వహణలో ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం భావించింది. ఇప్పుడు రెండు దశలూ ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఉండటం వల్ల సమగ్ర రవాణా వ్యవస్థను నిర్మించడం సులభమవుతుంది. 

    ప్రయాణికులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి 

     

    ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో నిత్యం సగటున 4.50 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇప్పటి వరకు 86 కోట్ల ప్రయాణాలు నమోదు అయ్యాయి. మెట్రో ప్రభుత్వపరమవ్వడం వల్ల భవిష్యత్‌లో కొత్త మెట్రో లైన్ల నిర్మాణం పాత కారిడార్ల అనుసంధానం వేగవంతం అవుతుంది. ప్రయాణికుల అవసరాలు అనుగుణంగా ఛార్జీలు, సమయపాలన, ఇతర సదుపాయాలపై ప్రభుత్వం పూర్తి నిర్ణయాధికారం కలిగి ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు అయిన ప్యూచర్ సిటీకి మెట్రోను అనుసంధానించే ప్రక్రియ మరింత సులభతరం చేయవచ్చు. 

     

    Click here to Read More
    Previous Article
    Grow Coriander in Water : 15 రోజుల్లోనే కొత్తిమీరను పెంచవచ్చు తెలుసా? మట్టి లేకున్నా.. నీటిలోనే పెంచేయండిలా
    Next Article
    Heatwave Alert : వడగాలుల హెచ్చరిక.. ప్రాణాపాయం పెంచేస్తోన్న ఎండలు, Heat Stroke రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment