Hussain Sagar Ganesh immersion rules 2026: ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనాల్లేవ్ - నిషేధం బోర్డులు పెట్టిన అధికారులు - మరి ఖైరతాబాద్ గణేశుడి పరిస్థితేంటి?

57 minutes ago

Tank Bund Ganesh immersion controversy: ట్యాంక్ బండ్‌పై నిమజ్జనాల వివాదం ప్రారంభమయింది. నిమజ్జనానికి అనుమతి లేదని అధికారులు బోర్డులు పెట్టారు.

Telangana High Court PoP Ganesh idols Hussain Sagar ban:  హైదరాబాద్‌లో వినాయక చవితి వేడుకలు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ప్రతి ఏటా తలెత్తే  హుస్సేన్‌సాగర్ నిమజ్జనం  వివాదం మళ్లీ తీవ్రరూపం దాల్చింది. ట్యాంక్ బండ్ పైభాగాన ఎలాంటి నిమజ్జనాలు నిర్వహించకూడదని జీహెచ్‌ఎంసీ , హైదరాబాద్ పోలీసులు స్పష్టమైన ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయగా.. శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయ స్థలమైన ట్యాంక్ బండ్‌పైనే నిమజ్జనాలు జరిపి తీరతామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తెగేసి చెప్పింది. అధికారుల హెచ్చరికలు ఒకవైపు, ఉత్సవ సమితి హెచ్చరికలు మరోవైపు ఉండటంతో, అసలు కోర్టు తీర్పులేమిటి, హుస్సేన్‌సాగర్‌లో ఏ తరహా విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అనుమతి ఉందనే అంశంపై సగటు భక్తుల్లో తీవ్ర అయోమయం నెలకొంది.

పిఓపి  విగ్రహాలను నిమజ్జనం బ్యాన్

హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనంపై ప్రధానంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్   విగ్రహాలు , మట్టి విగ్రహాల   మధ్య వ్యత్యాసాన్ని చట్టం స్పష్టంగా నిర్వచించింది. 2021లో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ప్రకారం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా హుస్సేన్‌సాగర్‌తో పాటు ఎలాంటి సహజ జలాశయాలలోనూ పిఓపి  విగ్రహాలను నిమజ్జనం చేయకూడదు. పిఓపి విగ్రహాల కోసం నగరవ్యాప్తంగా ప్రత్యేకంగా నిర్మించిన  బేబీ పాండ్స్ లో మాత్రమే నిమజ్జనం జరపాలని ఆదేశించింది. అయితే, పర్యావరణ అనుకూలమైన  మట్టి విగ్రహాలకు  మాత్రం హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి అనుమతి ఉంది.

మట్టి విగ్రహాలకు అనుమతి  - నెక్లెస్ రోడ్‌లో !

ఈ క్రమంలోనే  ట్యాంక్ బండ్  ప్రధాన వివాద స్పదంగా మారింది. ట్రాఫిక్ సమస్యలు, భద్రత ,   సరస్సు పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని అప్పర్ ట్యాంక్ బండ్ నుంచి నేరుగా విగ్రహాలను నీటిలో వేయడాన్ని హైకోర్టు నిషేధించింది. అందుకోసమే అధికారులు ట్యాంక్ బండ్ వెంట 10 అడుగుల ఇనుప గ్రిల్స్  ఏర్పాటు చేసి, ఫ్లెక్సీ బోర్డులు తగిలించారు. దీనికి ప్రత్యామ్నాయంగా పిఓపి రహిత, మట్టి విగ్రహాల నిమజ్జనం కోసం హుస్సేన్‌సాగర్ తీరంలోని  ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్   పరిసరాల్లో ప్రత్యేక క్రేన్లను అందుబాటులో ఉంచారు.

ట్యాంక్ బండ్‌పై చేయాలంటున్న ఉత్సవ సమితి

అయితే, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మాత్రం అధికారుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ట్యాంక్ బండ్ అనేది సాంప్రదాయక నిమజ్జన కేంద్రమని, అక్కడ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తోంది. అధికారులు తొలగించకపోతే తామే స్వయంగా ఆ బోర్డులను తీసివేసి, యథావిధిగా ట్యాంక్ బండ్‌పై నుంచే నిమజ్జనం జరిపి తీరతామని హెచ్చరించింది. పిఓపి ,  మట్టి విగ్రహాలనే భేదం లేకుండా ఉత్సవ మూర్తులన్నింటినీ హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేయాలనేది ఉత్సవ సమితి ప్రధాన డిమాండ్.  వాస్తవానికి గడచిన కొన్నేళ్లుగా ఇది ఒక పరిపాటిగా మారిపోయింది. ప్రతి ఏటా నిమజ్జనానికి కొద్దిరోజుల ముందు పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం లేదంటూ బోర్డులు పెట్టడం, ఆ తర్వాత నిమజ్జనం రోజున విపరీతమైన భక్తుల రద్దీ, ట్రాఫిక్ ఒత్తిడి మరియు ఉత్సవ సమితుల పట్టుదల కారణంగా క్రేన్లను ఏర్పాటు చేసి అనుమతించడం జరుగుతోంది. గత ఏడాది కూడా ట్యాంక్ బండ్‌పై 12 క్రేన్లు, ఎన్టీఆర్ మార్గ్‌లో 12 క్రేన్లు, పీపుల్స్ ప్లాజా వద్ద 8 క్రేన్లను ఏర్పాటు చేసి నిమజ్జనాలు నిర్వహించారు.

ఒత్తిడిలో అధికార యంత్రాంగం

 

 ఈ ఏడాది కూడా ప్రభుత్వం , పోలీసులు చట్టపరమైన నిబంధనలను అమలు చేయడంలోనూ, పర్యావరణాన్ని కాపాడటంలోనూ, భక్తుల భావోద్వేగాలను బ్యాలెన్స్  చేయడంలోనూ కత్తిమీద సాము చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజాల నుంచి మాత్రమే మట్టి విగ్రహాల నిమజ్జనాన్ని క్రమబద్ధీకరించడం, పిఓపి విగ్రహాలను బేబీ పాండ్స్ వైపు మళ్లించడం అధికారుల లక్ష్యం కాగా.. ఉత్సవ సమితి హెచ్చరికల మధ్య తుది నిమజ్జనం రోజున ట్యాంక్ బండ్ వద్ద ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో వేచి చూడాలి.
 

 

Click here to Read More
Previous Article
Supriya Yarlagadda: సెంట్రల్ సెన్సార్ బోర్డులో నాగ్ మేనకోడలు సుప్రియ - ఛైర్మన్ తెలుగోడే... ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
Next Article
Keesara Police Station ACB Trap: కీసర చెరువు వద్ద ఏసీబీ హైవోల్టేజ్ ఆపరేషన్ - రూ. 5 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన ఎస్ఐ, సీఐ! అసలు పట్టించింది బిర్యానీనే!

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment