YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?

11 hours ago

Janasena Future Strategy:వైఎస్సార్‌సీపీ నుంచి జనసేనలోకి భారీగా నేతల చేరికలతో కొత్త ఊపు వస్తోంది. అయితే కూటమి పరిమితుల వల్ల జనసేనకు జరిగే లాభనష్టాలు ఏంటి? పవన్ కళ్యాణ్ భవిష్యత్ వ్యూహం ఎలా ఉంటుంది?

Janasena Alliance Seat Adjustment TDP:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన ముఖ్య నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున జనసేన పార్టీ వైపు క్యూ కడుతున్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంపై నమ్మకంతో పాటు, ఏపీ సర్కార్‌లో ఉప ముఖ్యమంత్రిగా ఆయన పెంచుకున్న రాజకీయ గ్రాఫ్ ఈ చేరికలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రతిపక్షం నుంచి నాయకులు వరుసగా వచ్చి చేరుతుండటం వల్ల జనసేనకు రాజకీయంగా కొత్త ఊపు, ఒక బలమైన  పొలిటికల్ మూమెంటం లభిస్తోంది. అయితే, ఈ చేరికలు పార్టీని నిజంగా ఒక ప్రధాన ప్రత్యామ్నాయ శక్తిగా మారుస్తాయా? లేక కేవలం తాత్కాలిక హడావుడికే పరిమితమవుతాయా ? 
 
జనసేన వైపు వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు

ఏ రాజకీయ పార్టీకైనా నాయకులు, కేడర్ వరుసగా రావడం అనేది ప్రజాక్షేత్రంలో సానుకూల వాతావరణాన్ని  సృష్టిస్తుంది. వైఎస్సార్‌సీపీ నుంచి నేతలు జనసేనలోకి రావడం ద్వారా  రాష్ట్రంలో భవిష్యత్తు జనసేనదే  అన్న అభిప్రాయం ప్రజల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ బలపడుతోంది. ఇది పార్టీ ఇమేజ్‌ను పెంచడానికి, ద్వితీయ శ్రేణి కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి  ఉపయోగపడుతుంది. 
 ఈ చేరికల వల్ల రాజకీయ మూమెంటం వచ్చినప్పటికీ, జనసేన ప్రస్తుతం  టిడిపి-జనసేన-బీజేపీ అధికార కూటమి లో భాగంగా ఉంది. ఒక పార్టీ అధికార కూటమిలో ఉంటూ సొంతంగా ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని, స్వతంత్ర ప్రత్యామ్నాయ శక్తిని  ఆక్రమించడం సాధ్యం కాదు. ప్రభుత్వం సాధించే విజయాల్లో భాగస్వామ్యంతో పాటు, ప్రభుత్వ వ్యతిరేకత  వస్తే దాని ప్రభావం కూడా జనసేనపై పడుతుంది. అందువల్ల ఎంతమంది నాయకులు చేరినా, కూటమి పరిధిలోనే పవన్ కళ్యాణ్ రాజకీయం చేయాల్సి ఉంటుంది.

 వచ్చే ఎన్నికల్లో  సర్దుబాటు  తప్పదా?    

ఎంతమంది వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యేలు , దిగ్గజ నాయకులు జనసేన కండువా కప్పుకున్నా, ఎన్నికల సమయానికి వచ్చేసరికి పొత్తుల ధర్మం ప్రధాన అడ్డంకిగా మారుతుంది. కూటమి ఒప్పందం ప్రకారం జనసేనకు పరిమిత సంఖ్యలోనే స్థానాలు  దక్కే అవకాశం ఉంటుంది. దాంతో, కొత్తగా చేరిన సీనియర్ నేతలందరికీ టికెట్లు కేటాయించడం పవన్ కళ్యాణ్‌కు కత్తిమీద సాములా మారుతుంది. టికెట్లు దక్కని నాయకులు మళ్లీ అసంతృప్తికి గురై పార్టీ మారే లేదా తిరుగుబాటు చేసే ప్రమాదం కూడా ఉంది. జనసేనలో ఈ చేరికలు పూర్తి స్థాయిలో ఉపయోగపడాలంటే, ఆ పార్టీ భవిష్యత్తులో కూటమి నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి  కి ఎదగాలి. కూటమికి అతీతంగా, రాష్ట్రంలో  ముఖ్యమంత్రి పీఠం  లక్ష్యంగా జనసేన ఒక స్వతంత్ర రాజకీయ శక్తిగా మారినప్పుడే ఈ నేతల చేరికలు నిజమైన సీట్లుగా, ఓట్లుగా మారతాయి. లేకపోతే, టీడీపీ కేటాయించే కొన్ని సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

 పాత-కొత్త నేతల మధ్య ఘర్షణ   

మరో కీలకమైన అంశం ఏంటంటే.. మొదటి నుంచీ పవన్ కళ్యాణ్ వెంట ఉండి, పార్టీ కోసం కష్టపడిన జనసైనికులు , సిద్ధాంతపరమైన కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ నుంచి వస్తున్న నాయకులు ఎక్కువ భాగం అధికారంలో ఉండగా ప్రయోజనాలు పొందినవారే. అకస్మాత్తుగా పార్టీలోకి వచ్చిన కొత్త నాయకులకు ప్రాధాన్యత ఇస్తే, పాత కేడర్‌లో అసంతృప్తి రగిలే అవకాశం ఉంది. ఈ పాత-కొత్త నేతల మధ్య సమన్వయం కుదర్చడం జనసేన అధిష్టానానికి పెద్ద పరీక్షగా మారనుంది  వైఎస్సార్‌సీపీ నుంచి జనసేనలోకి వరుస చేరికలు పార్టీ వృద్ధికి మంచి సంకేతమే అయినా, అది కేవలం పొలిటికల్ మూమెంటం  వరకే పరిమితమవుతుంది. పవన్ కళ్యాణ్ తన పొత్తుల వ్యూహాన్ని, భవిష్యత్ రాజకీయ ప్రణాళికను స్పష్టంగా రూ పొందించుకుంటే తప్ప, ఈ నాయకుల బలం సీట్ల రూపంలోకి మారడం కష్టం. కూటమి పరిమితులను దాటుకొని జనసేన తన సొంత జెండాపై ఏ మేర అధికారాన్ని డిమాండ్ చేయగలదనే దానిపైనే ఈ చేరికల అసలు ఫలితం ఆధారపడి ఉంటుంది.

Click here to Read More
Previous Article
Revanth Reddy vs BJP Telangana: గాంధీ కుటుంబం కోసం ప్రాణమిస్తా - రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు వ్యూహం ఏంటి? బీజేపీ ఎందుకు టార్గెట్ చేస్తోంది?
Next Article
Bahadurpuga farmers: బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment