Aortic Dissection : అయోర్టిక్ డిసెక్షన్ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. ఇది గుండెపోటు కంటే ప్రమాదమా?

1 hour ago

Aortic Dissection Warning Signs : గుండె దగ్గర వచ్చే ప్రతి నొప్పి గుండెపోటు కాదని.. దానికంటే ప్రమాదకరమైన అయోర్టిక్ డిసెక్షన్ కావచ్చని నిపుణులు చెప్తున్నారు. దీని లక్షణాలు ఏంటో చూసేద్దాం.

Aortic Dissection Risk Factors and Treatment : ఛాతిలో అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి వస్తే అది గుండెపోటు కాదని దానిని అయోర్టిక్ డిసెక్షన్ అంటారని డాక్టర్ జగదీశ్ మదిరెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని యశోదా ఆస్పత్రిలో కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్​గా చేస్తోన్న డాక్టర్ జగదీశ్ ఈ ప్రమాదకరమైన హార్ట్ ప్రాబ్లమ్ గురించి పలు విషయాలు తెలిపారు. ఇది గుండెపోటు కంటే ప్రమాదమని.. లక్షణాలను గుర్తించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని లేకుంటే ప్రాణాపాయ ప్రమాదం పెరుగుతుందని హెచ్చరించారు. 

అయోర్టిక్ డిసెక్షన్

శరీరంలో అతిపెద్ద రక్తనాళం ఏఓర్టా. ఇది గుండె నుంచి శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని తీసుకెళ్తుంది. దీని గోడకు పలు పొరలు ఉంటాయి. వీటిలో లోపలి పొరలో చీలిక ఏర్పడితే రక్తం ఆ పొరల మధ్యకు ప్రవేశించి గోడను విడదీయడం ప్రారంభిస్తుంది. ఈ పరిస్థితినే అయోర్టిక్ డిసెక్షన్ అంటారు. చీలిక విస్తరిస్తే గుండె, మెదడు, కిడ్నీలు, కాళ్లు వంటి అవయవాలకు రక్తప్రసరణ దెబ్బతినొచ్చు. ఇది తీవ్రమైన పరిస్థితిని కలిగిస్తుంది కాబట్టి అయోర్టిక్ డిసెక్షన్ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని డాక్టర్ జగదీశ్ తెలిపారు. 

అకస్మాత్తుగా తీవ్రమైన ఛాతి నొప్పి

అయోర్టిక్ డిసెక్షన్‌లో కనిపించే ముఖ్యమైన లక్షణం అకస్మాత్తుగా తీవ్రమైన ఛాతి లేదా పై వీపు నొప్పి వస్తుంది. కొందరికి ఈ నొప్పి ఏదో చీల్చుతున్నట్లు, చిరిగిపోతున్నట్లు అనిపించవచ్చు. నొప్పి ఒక్కసారిగా తీవ్రంగా ప్రారంభం కావడమే దీని ముఖ్యమైన హెచ్చరిక.

నొప్పి మారడం

ఏఓర్టాలో ఏర్పడిన చీలిక రక్తనాళం వెంట విస్తరించవచ్చు. దీంతో మొదట ఛాతిలో మొదలైన నొప్పి వీపు, పొత్తికడుపు, మెడ లేదా ఇతర ప్రాంతాలకు వ్యాపించవచ్చు. నొప్పి స్థానం మారుతుంటే జాగ్రత్త పడాలి. 

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

అయోర్టిక్ డిసెక్షన్ వల్ల గుండెకు దగ్గరగా ఉన్న రక్తప్రవాహం ప్రభావితమైతే లేదా గుండె చుట్టూ రక్తం చేరితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు. ఛాతి నొప్పితో పాటు అకస్మాత్తుగా ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తే అత్యవసర వైద్య సహాయం అవసరం.

స్ట్రోక్‌ వంటి లక్షణాలు

అయోర్టిక్ డిసెక్షన్ వల్ల మెదడుకు వెళ్లే రక్తప్రవాహం దెబ్బతింటే.. స్ట్రోక్‌ తరహా లక్షణాలు కనిపించే అవకాశం ఉందని డాక్టర్ జగదీశ్ తెలిపారు. అకస్మాత్తుగా మాట తడబడటం, చూపు సమస్యలు, శరీరంలోని ఒక వైపు చేయి లేదా కాలు బలహీనంగా మారడం వంటి లక్షణాలు రావచ్చు.

కళ్లు తిరగడం

రక్తపోటు ఒక్కసారిగా పడిపోవడం లేదా గుండెకు, మెదడుకు రక్తప్రసరణలో అంతరాయం ఏర్పడటం వల్ల కొందరికి మూర్ఛ రావచ్చు లేదా స్పృహ కోల్పోవచ్చు. ఛాతి లేదా వీపు నొప్పితో పాటు ఇలాంటి లక్షణం కనిపిస్తే దానిని అత్యవసర పరిస్థితిగా పరిగణించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

మరిన్ని లక్షణాలు

అయితే దీని లక్షణాలు అందరిలో ఒకేలా ఉండకపోనచ్చు. ఒక చేతి లేదా కాలులో పల్స్ బలహీనంగా అనిపించడం, చేతులు లేదా కాళ్లలో బలహీనత, తిమ్మిరి, కాళ్లలో నొప్పి లేదా నడవడంలో ఇబ్బంది.. పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి, చల్లగా చెమటలు పట్టడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.

ఎవరికి ప్రమాదం ఎక్కువ?

అధిక రక్తపోటు ఎక్కువకాలంగా ఉన్నవారికి, ధమనుల్లో కొవ్వు పేరుకుపోయినవారికి ఈ ప్రమాదం ఎక్కువ, మార్ఫన్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన సమస్యలు, ఏఓర్టిక్ వ్యాధులకు కుటుంబ చరిత్ర ఉన్నవారు, వయసు పెరిగినవారు, స్మోకింగ్ చేసేవారికి కూడా ప్రమాదమే. ఈ ప్రమాద కారకాలు లేకపోయినా అయోర్టిక్ డిసెక్షన్ రావచ్చు. 

చికిత్స ఆలస్యం చేయకూడదట

అయోర్టిక్ డిసెక్షన్ ఒక మెడికల్ ఎమర్జెన్సీ. చీలిక పెరుగుతూ వెళ్తే గుండె, మెదడు, కిడ్నీలు, పేగులు, కాళ్లకు రక్తప్రసరణ దెబ్బతినవచ్చు. ఏఓర్టా చిట్లితే ప్రాణాపాయం మరింత పెరుగుతుంది. అందుకే లక్షణాలు కనిపించిన వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందడం చాలా ముఖ్యం. చీలిక ఉన్న ప్రాంతాన్ని శస్త్రచికిత్స, ఎండోవాస్క్యులర్ చికిత్స లేదా మందులతో తగ్గించేందుకు వైద్యులు ప్రయత్నిస్తారు. 

 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

Click here to Read More
Previous Article
Flash Flood Alert: ఏపీ, తెలంగాణలో ఆకస్మిక వరదల ముప్పు.. ఈ జిల్లాలకు IMD రెడ్ అలర్ట్
Next Article
Janasena Politcis: కూటమి బలంగా నిలబడాలి.. జనసేన గౌరవానికి భంగం వాటిల్లకూడదు: పిఠాపురంలో పవన్ కళ్యాణ్

Related లైఫ్‌స్టైల్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment