YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?

1 hour ago

Vizianagaram YSRCP: విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బొత్స బంధువు బడ్డుకొండ అప్పలనాయుడిపై వేటు, చిన్న శ్రీను రాజీనామా తర్వాత జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

YS Jagan Vs Botsa Satyanarayana North Andhra: ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయాల్లో దశాబ్దాలుగా తిరుగులేని రాజకీయ చక్రవర్తి గా వెలుగొందిన బొత్స సత్యనారాయణ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అధినాయకత్వం నుంచి అనూహ్యమైన షాక్‌లు తగులుతున్నాయి. జిల్లాపై బొత్స కుటుంబానికి ఉన్న ఏకఛత్రాధిపత్యానికి స్వస్తి పలుకుతూ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చాలా వేగంగా క్షేత్రస్థాయి మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇటీవల బొత్స మేనల్లుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు   వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి అధికార టీడీపీలో చేరిపోయిన వెంటనే.. ఆ ప్రభావం బొత్స కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడిపై పడింది. నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి బడ్డుకొండను తొలగించి, గదల సన్యాసినాయుడిని కొత్త సమన్వయకర్తగా నియమించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. మజ్జి శ్రీనివాసరావు, బడ్డుకొండ అప్పల్నాయుడు వియ్యంకులు కూడా. 

బొత్స రాజకీయంపై జగన్‌కు స్పష్టత ఉందా? 

ఈ నిర్ణయం వెనుక వైఎస్ జగన్ సుదీర్ఘ రాజకీయ వ్యూహం దాగి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.  2024 ఎన్నికల ఓటమి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పలువురు సీనియర్లు జంప్ అవుతున్న వేళ, బొత్స కుటుంబం కూడా రేపో మాపో వైఎస్సార్‌సీపీని వీడుతుందనే ప్రచారం బలపడింది. ముఖ్యంగా చిన్న శ్రీను టీడీపీలోకి వెళ్లడంతో, ఆ కుటుంబం ఇప్పటికే  గోడ మీద పిల్లి లా వ్యవహరిస్తోందని అధిష్ఠానం భావిస్తోంది. దాంతో, వాళ్లు పార్టీ వీడే వరకు వేచి చూసి నియోజకవర్గాల్లో పార్టీని ఖాళీ చేయడం కంటే,  వారే వెళ్లేలోపే తమ మార్క్ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని సిద్ధం చేయాలి  అనే కఠిన నిర్ణయానికి జగన్ వచ్చినట్లుగాచెబుతున్నారు. 

బొత్స పట్టు తగ్గించే ప్లాన్ 

బొత్స కుటుంబం వైఎస్సార్‌సీపీలో కొనసాగినప్పటికీ, వారి  కనుసన్నల్లోనే జిల్లా రాజకీయాలు నడవాలనే పాత ఫార్ములాకు స్వస్తి పలకడమే జగన్ వ్యూహం. అందుకే విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్ష పదవిని చిన్న శ్రీను నుంచి తప్పించి మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌కు అప్పగించారు. మరోవైపు బొత్స బంధువు బడ్డుకొండను నెల్లిమర్ల నుంచి పక్కన పెట్టడం ద్వారా.. పార్టీలో ఏ ఒక్కరిపై ఆధారపడబోమనే స్పష్టమైన సంకేతాన్ని పంపారు. పార్టీ వేదికలపై బొత్స సత్యనారాయణ, బడ్డుకొండ అప్పలనాయుడు కన్నీటి పర్యంతమవుతూ ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ, అధిష్ఠానం మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కొన్ని గంటల వ్యవధిలోనే శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

జగన్ ప్రయత్నాలు ఫలిస్తాయా? 

 

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఈ పరిణామాలు కొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి. బొత్స కుటుంబ పట్టున్న స్థానాలను ఒక్కొక్కటిగా విడదీస్తూ, ద్వితీయ శ్రేణి నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా జగన్ జిల్లాలో సరికొత్త వైఎస్సార్‌సీపీ క్యాడర్‌ను నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది బొత్స వర్గాన్ని  డిఫెన్స్‌లో పడేసింది. తము పార్టీలో ఉంటూనే తమ ప్రత్యర్థులకు బాధ్యతలు అప్పగిస్తుంటే.. ఇక పార్టీలో కొనసాగాలా వద్దా అనే పునరాలోచనలో బొత్స సత్యనారాయణ పడేలా అధినాయకత్వపు చర్యలు ఉన్నాయి. వారు వెళ్లేలోపే సొంత సామ్రాజ్యాన్ని పునర్నిర్మించుకోవడం  అనే క్రాస్ స్ట్రాటజీని జగన్ అమలు చేస్తున్నారు. ఒకవేళ బొత్స సత్యనారాయణ కుటుంబం వైఎస్సార్‌సీపీని వీడినా, జిల్లాలో పార్టీ పూర్తిగా పడిపోకుండా ముందస్తుగా కొత్త నాయకులను నిలబెట్టాలనే ఆలోచన స్పష్టమవుతోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి విజయనగరంలో బొత్స వర్గం లేకపోయినా నిలబడేలా వైఎస్సార్‌సీపీ వేస్తున్న ఈ పాచికలు ఉత్తరాంధ్ర రాజకీయ రణరంగాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. 

 

Click here to Read More
Previous Article
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment