Telangana Assembly Clash: అసెంబ్లీ ఘర్షణల రగడ - కాంగ్రెస్‌ది అతి రాజకీయమా? KTR పీఏ, పీఆర్వోల విచారణతో తిరగబడ్డ వ్యూహం!

1 hour ago

BRS vs Congress 2026: తెలంగాణ అసెంబ్లీ ఘర్షణల కేసులో కేటీఆర్ పీఏ, పీఆర్వోలపై సైఫాబాద్ పిఎస్ విచారణ వివాదం అయింది. కాంగ్రెస్ ప్రభుత్వ సెల్ఫ్ గోల్ తో బీఆర్ఎస్ కౌంటర్ ఎటాక్‌ చేస్తున్నట్లు అయింది.

Telangana politics self goal:   తెలంగాణ శాసనసభ వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు జరిపిన నిరసన, ఆ తదనంతరం జరిగిన ఘర్షణల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మలుపులు తిరుగుతోంది. చట్టసభల ప్రాంగణంలో ఆందోళనను తీవ్రంగా పరిగణించి, ప్రతిపక్షంపై రాజకీయ మైలేజ్ సాధించాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగింది. బీఆర్ఎస్ అగ్రనేతలపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేయడం, చివరికి మాజీ మంత్రి కేటీఆర్ పిఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్‌లను సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ పేరుతో గంటల తరబడి హాజరుపరచడం వరకు వ్యవహారాన్ని తీసుకెళ్లారు. అయితే, ఈ పరిణామాలను విశ్లేషిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతటి రాజకీయ ప్రయోజనాన్ని ఆశించిందో, అంతకంటే ఎక్కువ రాజకీయ ప్రతికూలతలను ఎదుర్కొనే ప్రమాదంలో పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కేటీఆర్ వ్యక్తిగత సిబ్బంది విచారణతో సమస్యలు    

ప్రజాప్రతినిధులపై నమోదు చేసిన తీవ్రమైన కేసులు, అలాగే విచారణ ప్రక్రియ శృతిమించడం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది. బీఆర్ఎస్ నేతలను చట్టబద్ధంగా కట్టడి చేయాలనే ఉద్దేశం  వ్యూహాత్మకమే అయినప్పటికీ, కక్షసాధింపు చర్యల స్థాయికి వ్యవహారాన్ని తీసుకెళ్లారనే భావన ప్రజల్లోకి వెళ్తోంది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్ సిబ్బందిని విచారిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు ప్రవేశించి గొడవ పడటానికి యత్నించారనే వార్తలు కలకలం రేపాయి.  పోలీస్ స్టేషన్ లోపలే కస్టడీలో ఉన్నవారిపై దాడికి ప్రయత్నించడం విచారకరం, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి  అని కేటీఆర్ విమర్శించడంతో బీఆర్ఎస్ దీన్ని బలమైన పొలిటికల్ డిఫెన్స్ అస్త్రంగా మార్చుకోగలిగింది.

అనవసరపు విచారణలు ఇబ్బందికరంగా మారాయా?

విచారణాధికారులు , శాంతిభద్రతల యంత్రాంగం వైఫల్యం అని బీఆర్ఎస్ ప్రతిదాడి చేస్తోంటే, పోలీసు శాఖ మాత్రం దాడి ఆరోపణలను ఖండించి సీసీటీవీ ఆధారాలను తెరపైకి తెచ్చింది. అయినప్పటికీ, ప్రభుత్వం తమను వేధిస్తోందని చూపించే అవకాశం బీఆర్ఎస్‌కు దొరికింది. కేవలం ఒక నిరసన ఘర్షణను  రాజకీయంగా వినాశకరమైన నేరం గా చిత్రీకరించబోయి, బీఆర్ఎస్ స్థానిక శ్రేణులకు సరికొత్త కసిని, సానుభూతిని కాంగ్రెస్ నాయకత్వమే అందించినట్లయింది. ప్రతిపక్షాన్ని ఇరకాటంలో పెట్టాలనుకున్న ప్రభుత్వం, తానే సెల్ఫ్ గోల్ వేసుకుని ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది.  రాజకీయాల్లో అతిగా స్పందించడం ఉద్రిక్తతలను మరింత పెంచుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులో సిట్ విచారణలు, సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ వంటి విజువల్స్ ద్వారా మీడియాలో మైలేజ్ సాధించవచ్చని భావించినా, అది కాస్తా వికటించి ప్రజాప్రతినిధుల సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్నారనే అభిప్రాయానికి దారితీసింది. 

కాంగ్రెస్ సీన్ మార్చుకోవాల్సిందే !

 

శాంతిభద్రతల నిర్వహణలో తమ బలాన్ని నిరూపించుకోవాల్సిన ప్రభుత్వం, ప్రతిపక్షాలకు మైలేజ్ ఇచ్చేలా ప్రవర్తించడం వ్యూహాత్మక లోపంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఘటనను ఆసరాగా చేసుకుని ప్రతిపక్షం నోళ్లు మూయించాలనే కాంగ్రెస్ ప్రయత్నం, బీఆర్ఎస్‌కు తమ క్యాడర్‌ను తిరిగి సమీకరించుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఈ ఓవర్ యాక్షన్ మూలంగా రాజకీయ లాభం కంటే కాంగ్రెస్ పార్టీ నష్టపోయే ప్రమాదమే ఎక్కువగా కనిపిస్తోంది. తక్షణమే ఈ వ్యవహారాన్ని సమర్థవంతంగా సద్దుమణిగేలా చేయకపోతే, రాబోయే రోజుల్లో ప్రతిపక్షాల సానుభూతి వేవ్‌కు కాంగ్రెస్ సమాధానం చెప్పుకోవాల్సి రావచ్చు. 

Click here to Read More
Previous Article
Alla Nani Passes Away: ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
Next Article
Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment